కలం, వరంగల్ బ్యూరో: హైదరాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) భౌతికకాయం శుక్రవారం ఉదయం హనుమకొండ (Hanumakonda) కు చేరుకుంది. అదాలత్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు ఘనంగా నివాళులర్పించారు. పూలమాలలు సమర్పించి ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు, కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం భౌతికకాయాన్ని భారీ వాహన ర్యాలీగా హంటర్ రోడ్డు మీదుగా నల్లబెల్లిలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. దారిపొడవునా ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చివరి చూపు కోసం బారులు తీరారు. “పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే”, “జై తెలంగాణ” నినాదాలతో హనుమకొండ పరిసరాలు మార్మోగాయి. ఆయన మృతితో తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడిని కోల్పోయామని పలువురు ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

