వీ వాంట్ ట్రీస్, నాట్ ఫ్లైఓవర్స్.. చెట్ల నరికివేతపై గళమెత్తిన జెన్‌జీ!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ బంజారాహిల్స్ కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) పార్క్ చుట్టూ హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా వేలాది చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ జెన్-జీ (Gen Z) శాంతియుతంగా నిరసన చేపట్టింది. ఆరు మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 1,500 చెట్లను తొలగించారు. మరో 1,800 చెట్లను నరికేందుకు సిద్ధమవుతుండగా నిరసనకారులు తప్పుబట్టారు. 60,000 మెట్రిక్ టన్నుల సిమెంట్, 5,000 మెట్రిక్ టన్నుల స్టీల్‌తో చేపట్టే ఈ నిర్మాణాలు పర్యావరణ విధ్వంసానికి దారితీస్తాయని, తద్వారా మానవ ఆరోగ్యం క్షీణిస్తుందని యువత హెచ్చరించింది.

అయితే పార్కుకు రెగ్యులర్‌గా వచ్చే కొందరు నిరసనకారులను అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ‘ఫ్లైఓవర్లు రాకపోతే పదేళ్ల తర్వాత వాహనాలు రోడ్లపై కదలవు’ అంటూ విమర్శించారు. అక్కడున్న పర్యావరణ సామాజిక కార్యకర్తలు వారిని వారించారు. నిరసన చేస్తున్న బురఖా ధరించిన యువతులను ఉద్దేశించి ‘ముందు జనాభా పెరుగుదల గురించి మాట్లాడండి, దానివల్లే ఈ వంతెనలు కట్టాల్సి వస్తోంది’ అంటూ వింత వాదనలు వినిపించారు. ఈ ఘటనతో షాక్ అయిన యువత షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేయడంతో వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. హైదరాబాద్ నిర్వహణలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చెట్లను నరకడం పరిష్కారం కాదని యువత, పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం పచ్చని చెట్లను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

గత రెండు దశాబ్దాలుగా నగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించినా ట్రాఫిక్ కష్టాలు తీరలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా వ్యక్తిగత కార్ల వినియోగం పెరగడం వల్లే రహదారులు నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి ప్రాంతంలో గతంలో జరిగిన వృక్షాల నరికివేత వల్ల నెమళ్లు వీధుల పాలై కుక్కల బారిన పడ్డాయని, ఇప్పుడు కేబీఆర్ పార్క్ విషయంలోనూ అదే జరుగబోతుందోని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ బఫర్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం సరికాదని హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>