వన్డేలు చూడను.. టెస్టులే అసలైన క్రికెట్ : హర్భజన్ సింగ్!

కలం, స్పోర్ట్స్ : భవిష్యత్తులో అంతర్జాతీయ ద్వైపాక్షిక క్రికెట్ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) హెచ్చరించారు. టీ20 లీగ్‌లకు పెరుగుతున్న ఆదరణే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. పీటీఐ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో భజ్జీ క్రికెట్‌లో మారుతున్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుమారు 70 శాతం మంది అభిమానులు అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే క్లబ్ క్రికెట్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారని హర్భజన్ తెలిపారు. ఐపీఎల్, ది హండ్రెడ్, బిగ్ బాష్ లీగ్ వంటి టీ20 టోర్నీలకు స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయని చెప్పారు. అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకే ఎక్కువ ఆదరణ లభిస్తోందని, బలహీన జట్ల పోరాటాలకు అంతగా వ్యూయర్‌షిప్ ఉండటం లేదన్నారు.

వన్డేలపై ఆసక్తి లేదన్న భజ్జీ

తనకు వన్డే క్రికెట్‌పై ప్రస్తుతం ఆసక్తి లేదని హర్భజన్ స్పష్టం చేశారు. భారత్ తరఫున 236 వన్డేలు ఆడి 269 వికెట్లు తీసినప్పటికీ.. ఇప్పుడు వన్డే మ్యాచ్‌లను చూడటానికి ఇష్టపడటం లేదన్నారు. డబ్బులు చెల్లించాల్సి వచ్చినా టెస్ట్ క్రికెట్‌ను మాత్రమే చూస్తానని చెప్పారు. ఒక క్రికెటర్ ప్రతిభ, ఓర్పు, నైపుణ్యాలను పూర్తిస్థాయిలో పరీక్షించేది టెస్ట్ ఫార్మాటేనని హర్భజన్ పేర్కొన్నారు. అందుకే టెస్ట్ క్రికెట్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

లీగ్‌లతో మారుతున్న ఆటగాళ్ల ప్రాధాన్యతలు

టీ20ల రాకతో ప్రేక్షకుల ఆలోచనా విధానంతో పాటు ఆటగాళ్ల ప్రాధాన్యతలు కూడా మారిపోయాయని హర్భజన్ అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్, న్యూజిలాండ్‌కు చెందిన కొందరు ఆటగాళ్లు జాతీయ కాంట్రాక్టులను వదులుకుని ఫ్రాంచైజీ లీగ్‌ల వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. టీ20 లీగ్‌లు భారీ ఆదాయంతో పాటు వినోదాన్ని అందిస్తుండటంతో అంతర్జాతీయ క్రికెట్ గత వైభవాన్ని తిరిగి పొందడం కష్టమేనని హర్భజన్ అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ద్వైపాక్షిక అంతర్జాతీయ క్రికెట్‌కు మరింత ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, తాను రాస్తున్న ఆత్మకథ ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని హర్భజన్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>