నల్లగొండలో గ్యాస్ కొర‌త‌.. ఉసూరుమంటున్న‌ ఉపాధి..!

కలం, నల్లగొండ బ్యూరో: యుద్ధం చిరు వ్యాపారుల కొంప ముంచుతోంది. ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో గత కొన్ని రోజులుగా గ్యాస్ సిలిండర్ల కొరత (Gas Shortage) చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఒకప్పుడు తెల్లవారుజామునే స్టౌ వెలిగించి.. కస్టమర్ల సందడితో కళకళలాడే టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అటు వాణిజ్య సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకడం.. ఇటు గృహ వినియోగ సిలిండర్ల సరఫరాలో జాప్యం జరగడంతో హోటళ్లు, టీ స్టాళ్లు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడపలేక యజమానులు చేతులెత్తేశాయి. దీంతో ఆ ఎఫెక్ట్ కస్టమర్లపైనా పడుతోంది.

చిన్న చిన్న హోటల్స్, బండ్లపై నిర్వహించే టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ మూతపడడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుకు వెళ్లే సమయంలో టిఫిన్ చేసి వెళ్లడమో.. హాఫ్ డే స్కూల్స్ వల్ల పిల్లలకు టిఫిన్ కొనుగోలు చేసి లంచ్ బాక్స్‌లోకి పెట్టడమో చేయడం సామాన్య కస్టమర్లకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. చిన్న హోటళ్లు లేకపోవడం.. పెద్ద హోటల్స్‌కు వెళితే.. ఒక్కో ప్లేట్ తక్కువలో తక్కువ రూ.50కి పైనే చెల్లించాల్సి వస్తుంది. దీంతో సామాన్యులకు అది భారంగా మారుతోంది. ఇదిలావుంటే.. మిర్చి బండి, పానీపూరి బండి, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్.. ఇవీ కేవలం వ్యాపారాలుగా చూడలేం.. వేలాది మందికి ఉపాధినిచ్చే జీవనమార్గాలని చెప్పాలి.

ఉమ్మడి జిల్లాలో 1110 హోటల్స్

గ్యాస్ కొరత ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలపై విపరీతంగా పడిందని చెప్పాలి. టీ స్టాల్స్, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తదితర చిరు వ్యాపారులన్నీ కలుపుకుని దాదాపు 1110 వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే వీటిపై వేలాది కుటుంబాల జీవనోపాధి ఆధారపడి ఉంది. వాటిని నిర్వహించే నిర్వాహకులతో పాటు అందులో పనిచేసే వర్కర్ల జీవనోపాధి సైతం దెబ్బ తింటోంది. దాదాపు గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఒక్కోటి మూత పడుతూ వస్తున్నాయి.

మొదటి మూడు నాలుగు రోజులు ఉన్న సిలిండర్లతో అడ్జస్ట్ చేసుకుని నడిపించారు. కానీ గ్యాస్ సరఫరా ఎంతకీ గాడిలో పడకపోవడంతో టీ స్టాల్స్, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్స్ మూతపడక తప్పడం లేదు. బయట కమర్షియల్ సిలిండర్ కొనుగోలు చేయాలంటే.. రూ.3వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. అలా చేస్తే.. రూ.10కి విక్రయించాల్సిన చాయ్‌ని రూ.20కి అమ్మితే గానీ గిట్టుబాటు కావడం లేదు. చాయ్‌కి రూ.20 అనేసరికి సామాన్యుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది. టిఫిన్ సెంటర్లలోనూ అదే పరిస్థితి నెలకొంది. నిన్నమొన్నటి వరకు రూ.30కి ప్లేట్ ఇచ్చి.. గ్యాస్ ధరలతో రూ.50 అంటే ఎవ్వరూ తినే పరిస్థితి లేదు. దీంతో టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ మూయకతప్పని పరిస్థితి.

కిస్తీలు కట్టలేక ఫైనాన్షియర్లతో తిప్పలు..

కమర్షియల్ సిలిండర్ ధరలు సామాన్య వ్యాపారి భరించే స్థాయిని దాటిపోయాయి. హోటల్ నడపాలంటే రోజుకు ఒకటి లేదా రెండు సిలిండర్లు అవసరమవుతాయి. పెరిగిన ధరల వల్ల పెట్టుబడి ఖర్చు రెట్టింపు అవ్వగా, కస్టమర్లపై ఆ భారం వేయలేక వ్యాపారులు సతమతమవుతున్నారు. చాయ్ పొయ్యి వెలగడం లేదు. పాలు, చక్కెర ధరలకు తోడు గ్యాస్ భారం తోడవడంతో జిల్లావ్యాప్తంగా వందలాది టీ కొట్లు మూతపడ్డాయి. ఉదయం పూట సందడిగా ఉండే రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. గ్యాస్ దొరక్కపోవడంతో వ్యాపారాన్ని నిలిపివేస్తున్నారు.

నిజానికి వీధి వ్యాపారుల జీవనం అంతా రోజువారీ ఆదాయం మీదే ఆధారపడి ఉంటుంది. వ్యాపారం సాగాలంటే ఫైనాన్షియర్ల దగ్గర రోజువారీ వడ్డీకి డబ్బులు తెస్తుంటారు. గడిచిన కొద్ది రోజులుగా వ్యాపారం లేకపోవడంతో రోజువారీ కిస్తీలు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక, పాత అప్పులు తీర్చలేక చాలామంది వ్యాపారులు ఊర్ల నుంచి వెళ్లిపోవడం లేదా గడప దాటి బయటకు రావడానికి భయపడుతున్నారు. అయితే కొంతమంది వ్యాపారులు కట్టెల పొయ్యి వైపు మొగ్గు చూపుతున్నా.. పట్టణ ప్రాంతాల్లో అది సాధ్యం కావడం లేదు. పైగా కట్టెల ధరలు కూడా పెరగడం.. పొగ వల్ల కస్టమర్లు ఇబ్బంది పడతారనే భయంతో ఆ దారి సైతం మూసుకుపోయింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని వేలాది కుటుంబాలు ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నాయి. గ్యాస్ కొరతను అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. ఈ చిరు వ్యాపారులు శాశ్వతంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>