Mobile Popup Ad
Mobile Popup Ad

నీళ్లు ఇవ్వకపోతే.. కన్నెపల్లి మోటార్లను ఆన్ చేస్తాం: గంగుల

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో వరద కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేయకుంటే కేటీఆర్ నాయకత్వంలో రైతులందరితో కలసి కన్నెపల్లి వరకు పాద యాత్ర చేపట్టి మోటార్లను ఆన్ చేసి రైతులకు నీరందిస్తామని రేవంత్ సర్కార్ ను బీఆర్ఎస్ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) హెచ్చరించారు. వరద కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి గంగుల మహాధర్నా నిర్వహించారు. నాగుల మల్యాల శివారులోని ఆచంపల్లి వరద కాలువ ఓటీ స్లూయిస్‌ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు వంటావార్పు చేపట్టి ప్రభుత్వానికి నిరసన తెలిపారు.

చెరువులు ఎండిపోతున్నాయి..

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. గత పదేళ్లుగా కళకళలాడిన గొలుసుకట్టు చెరువులు కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి సమయానికి సాగునీటిని విడుదల చేయకపోవడంతో కరీంనగర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నీటిలేక వెలవెలబోతున్నాయని అన్నారు. మేడిగడ్డ నుండి ప్రస్తుతం కూడా వేలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు..

గతంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ నీటి వనరులను వినియోగించుకున్నారే తప్ప ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలనే ఆలోచన చేయలేదన్నారు. రైతుల కష్టాలను గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. రాష్ట్రానికి అవసరమైన నీరు, విద్యుత్‌తో పాటు రైతుబంధు వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచారని తెలిపారు.

అందుకే నీళ్లు విడుదల చెయట్లేదు..

కాళేశ్వరం మోటార్లు నడిపితే కేసీఆర్‌కు పేరు వస్తుందనే రాజకీయ కారణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి విడుదలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొత్తపల్లి ప్రాంత పరిస్థితిని చూసి చలించిపోయానని, అనంతరం పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రోడ్లు, చెరువులు, కుంటలను అభివృద్ధి చేశామని చెప్పారు. కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు సాగునీరు అందించేందుకు వరద కాలువ నుంచి నాగుల మల్యాల చెరువుకు నీరు చేరేలా తూము ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ఇందుకు అధికారులతో చర్చించి కేసీఆర్ వద్ద నుంచి నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు.

భారీ మోటార్లు ఏర్పాటు చేస్తాం..

తూము ఏర్పాటుకు వారి భూములను ఇచ్చి సహకరించిన రైతులకు గంగుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి తూము ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన గంగుల.. లేనిపక్షంలో వరద కాలువలో భారీ మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు నీరు అందిస్తామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రైతులతో కలిసి కన్నెపల్లి వరకు పాదయాత్ర నిర్వహించి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీరందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన సుమారు 1000 మంది వరకు రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>