కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఓటర్ సేవలు షురూ

కలం, కరీంనగర్ : ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ (BRS) ఆధ్వర్యంలో ప్రత్యేక సహాయ కేంద్రాలు (Help Desks) ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) తెలిపారు. ఆదివారం నగరంలోని కిసాన్‌నగర్, చింతకుంట ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) హెల్ప్‌డెస్క్‌లను మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ పూర్తి చేయడమే ఈ హెల్ప్‌డెస్క్‌ల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం, బీఎల్‌వోల మధ్య సమన్వయ లోపం కారణంగా నగరంలో ఇప్పటివరకు కేవలం 14 శాతం మాత్రమే ఓటరు సవరణ ప్రక్రియ పూర్తైందని ఆరోపించారు. జూలై 24లోపు మిగిలిన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని, ఆన్‌లైన్ సర్వర్‌లు సరిగా పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ స్వయంగా ముందుకొచ్చి నగరంలోని 10 కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తులు నింపేందుకు సహాయం అందిస్తోందని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ కుమార్, మాజీ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, కార్పొరేటర్‌లు ఎడ్ల సరిత అశోక్, కంసాల శ్రీనివాస్, మేచినేని అశోక్‌రావు, ఐలెందర్ యాదవ్, సుంకి శాల సంపత్‌రావు, నాయకులు నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>