కలం, కరీంనగర్ బ్యూరో: కేసీఆర్‌కు పేరొస్తుందన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించడం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. ఎల్ఎండి జలాశయం అడుగంటడంతో కరీంనగర్ నగర ప్రజలకు, హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. శనివారం నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎల్ఎండిలో వినూత్న కార్యక్రమంతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంగుల కమలాకర్ హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి అడుగంటిన జలాశయంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఆటలు ఆడారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ రెండు దశాబ్దాల చరిత్రలో జూలై మాసంలో ఎల్ఎండి నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి పడిపోవడం ఇదే మొదటిసారి అని అన్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు తాగునీరు, సాగునీరు అందకుండా పోతుందన్నారు. మేడిగడ్డను మరమ్మతు చేయకపోవడం ద్వారా ప్రతిరోజు 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తుందన్నారు. ఆ నీటిని నిల్వ చేసి మేడిగడ్డ నుండి కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లిలకు తరలించాలని సూచించారు. తద్వారా ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి వరద కాలువ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండిలను నీటితో నింపాలన్నారు.
అదే విధంగా మిడ్ మానేరుపై ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేసి కొత్తపెల్లి మండలంలోని బావు పేట, ఎలగందుల, నాగుల మల్యాల, బద్దిపల్లి, కమాన్‌పూర్, శ్రీరాములపల్లి , కాజీపూర్ గ్రామ చెరువులు నింపాలన్నారు. ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామన్నారు. బేషాజాలకు పోకుండా.. ప్రజలకు నీరందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎల్ఎండిలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు పడే అవకాశం లేదన్నారు.
మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ గా ఉంటుందని కేవలం రెండు టీఎంసీల నీటి ద్వారా కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందించలేమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు తాగునీరు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి మంచినీళ్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇటు తాగునీరుకు కరీంనగర్ ప్రజలకు ఇబ్బంది తలెత్తుతుందని.. ఎల్ఎండి మీద ఆధారపడి వ్యవసాయం సాగు చేసుకుంటున్న మానకొండూరు, హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు లేక రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉత్పన్నమవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడాతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పలు గ్రామాల సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

