కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) పట్టణంలో మంగళవారం నిర్వహించనున్న 9వ రోజు గణేష్ శోభాయాత్రను (Ganesh Immersion) ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల( SP Janaki Sharmila) తెలిపారు. సోమవారం పట్టణంలోని గుల్జార్ మజీద్ ప్రాంతంతో పాటు శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన బందోబస్తు, భద్రతా చర్యలపై పోలీస్ అధికారులతో సమీక్షించారు.
శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో పాటు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీస్ శాఖకు సహకరించి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సమ్మయ్య, ఎస్‌ఐలు శ్రీకాంత్, జాఫర్, సాయి సిద్ధార్థ్, ఆర్‌ఎస్‌ఐ ఎం. రవి తదితరులు పాల్గొన్నారు.

