గాగిరెడ్డిపల్లి ఎరుకల కుటుంబాలకు న్యాయం చేయాలి: కుతాడి శివరాజ్

కలం, కరీంనగర్: చిగురుమామిడి మండలం, గాగిరెడ్డిపల్లి (Gagireddipally) గ్రామంలో వందల సంవత్సరాలుగా చెరువు పక్కన గుడిసెలు వేసుకొని తాత ముత్తాతల కాలం నుండి జీవిస్తున్న నిరుపేద ఎస్టీ ఎరుకల కుటుంబాలకు న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని తెలంగాణ జనతా పార్టీ (TJP) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ (Kuthadi Shivaraj) అన్నారు. గాగిరెడ్డిపల్లి గ్రామంలో కొంతమంది బీసీ కులానికి చెందిన వ్యక్తులు కావాలని ఎరుకల కులస్తుల స్థలంలోకి చొరబడి, వారి ఇంటి ముందు ఉన్న భారీ చెట్లను తొలగించారని ఆయన ఆరోపించారు.

అంతేకాకుండా, ఎస్టీ సబ్-ప్లాన్ కింద నిర్మించిన వాటర్ ట్యాంకును కూల్చివేసి, ఆ చెత్తను, చెట్ల కొమ్మలను ఎరుకల వారి ఇంటి ముందు, దారికి అడ్డంగా వేసి వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ అవమానపరుస్తున్నారని తెలిపారు. మూడు రోజులుగా గుంపులుగా వచ్చి ఇంటి మీదికి దాడికి యత్నించడం వల్ల ఎరుకల కుటుంబాలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని, ఎలాంటి ఆధారం లేని నిరుపేదలను ఇలా వేధించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై సెక్షన్ 3(1)(జి) ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను ఆయన డిమాండ్ చేశారు.

అధికారులు వెంటనే ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధితులను ఆదుకోవాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎరుకల కులస్తులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ జనతా పార్టీ (TJP) న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>