కలం,జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నుంచి కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు (Irkichedu) గ్రామం కేవలం 28 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మారుమూల గ్రామానికి ఇప్పటివరకూ బస్సు వసతి లేదు. ప్రైవేట్ వాహనాల ద్వారా ప్రజలు రాకపోకలు సాగించారు.
ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు నేటి నుంచి కొండాపురం, వెంకటాపురం, ఇర్కిచేడు, పాగుంట ముసల్ దొడ్డి, ఇర్కిచేడు గ్రామాలకు ఉదయం, సాయంత్రం వేళలో ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఎనిమిదేండ్ల తర్వాత బస్సు రావడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రూట్లో ప్రతి రోజూ రెండు ట్రిప్పులు నడిపిస్తుండగా, రూ. 7 వేల వరకు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
పోరాటానికి దక్కిన విజయం
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు, నిరంతర పోరాటాలకు లభించిన విజయమిది. ప్రజా సమస్యలపై వెనకడుగు వేయకుండా, రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన పోరాటం ఫలితంగా కేటిదొడ్డి మండలం కొండాపురం, ఇర్కిచేడు, వెంకటాపురం, పాగుంట, ముసల్ దొడ్డి గ్రామాలకు గద్వాల ఆర్టీసీ డిపో నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం (RTC Bus Service) పునరుద్ధరించబడింది.
బీఆర్ఎస్ యువ నాయకుడు గాజుల కృష్ణ రెడ్డి నాయకత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, రైతులు మరియు గ్రామస్థులు కలిసికట్టుగా చేసిన సుదీర్ఘ పోరాటానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దిగివచ్చి బస్సు సర్వీసును ప్రారంభించాయి. ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు అందించడమే కాకుండా, ఫలితం లేని సమయంలో రోడ్లపై బైఠాయించి రాస్తారోకోలు నిర్వహించి అధికారులను నిలదీశారు. పార్టీలు, రాజకీయాల హద్దులు పక్కనపెట్టి కేవలం ప్రాంతీయ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సాగించిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజయం సాకారం కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

