కలం, బోథ్: నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సోమవారం ప్రభుత్వ పథకాల అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
గతంలో మంజూరైన డయాలసిస్ సెంటర్ తరలిపోవడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారని, బోథ్‌లో డయాలసిస్ సెంటర్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చోడలో 30 పడకల సీహెచ్‌సీ మంజూరు చేయాలని కోరారు. అలాగే నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో నెలకొన్న అటవీ, భూ సమస్యలను పరిష్కరించి అర్హులకు అటవీ హక్కు పట్టాలు అందించాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ఈ అంశాలపై ప్రభుత్వం త్వరితగతిన సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

