కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ విప్‌లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు ప్రభుత్వ విప్‌లేనని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎమ్‌సీఆర్‌హెచ్ఆర్డీ (MCRHRD)లో శాసనసభ, శాసనమండలి విప్‌లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ విప్‌లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎండాకాలం దృష్ట్యా నియోజవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవల్సిన చర్యలు..దీనితోపాటు వరి ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు. సీఎం స్పందిస్తూ.. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజలకు కల్పించాలని సీఎం తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ విప్ లతో సమన్వయం చేసుకునేందుకు, ప్రజా సమస్యలు తెలసుకునేందుకు వారంలో ఒక రోజు విప్ లకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయరమణరావు, రామచంద్రు నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పాల్గొన్నారు.

