ఫ్రెంచ్ ఓపెన్‌లో సెగలు: సినర్ అవుట్, జకోవిచ్ అలర్ట్ !

కలం, స్పోర్ట్స్‌ : ఫ్రెంచ్ ఓపెన్‌ (French Open)లో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. టోర్నమెంట్ మొదలైన ఐదు రోజులుగా వరుసగా 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ తీవ్రమైన వేడి వాతావరణంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాప్ ర్యాంకర్ జాన్నిక్ సినర్ అనూహ్యంగా ఓడిపోయాడు. జువాన్ మాన్యుయెల్ సెరుండోలో చేతిలో ఆయన పరాజయం పాలయ్యాడు. ఇంత ఎండ ఉన్నా కూడా నిర్వాహకులు ‘ఎక్స్‌ట్రీమ్ వెదర్ పాలసీ’ని మాత్రం అమలు చేయలేదు. ఒకవేళ ఆ నిబంధనలు వాడినా కూడా కోర్ట్ ఫిలిప్-చాట్రియర్ స్టేడియం రూఫ్ (పైకప్పు) మూసివేసే అవకాశం లేదు. ఎందుకంటే ఫ్రెంచ్ ఓపెన్ నిబంధనల్లో రూఫ్ మూసివేయడం అనే ముచ్చటే లేదు.

ఈ పాలసీ ప్రకారం ఎండ, గాలి, తేమను కొలిచే డబ్ల్యూబీజీటీ (WBGT) రీడింగ్ 30.1 డిగ్రీలు దాటితే ఆటగాళ్లకు 10 నిమిషాల కూలింగ్ బ్రేక్ ఇస్తారు. అదే రీడింగ్ 32.2 డిగ్రీలు దాటితే ఆటను పూర్తిగా నిలిపివేస్తారు. కానీ సినర్ మ్యాచ్ మొదలైనప్పుడు 29 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత, ఆ తర్వాత 32 డిగ్రీలకు చేరినా నిర్వాహకుల లెక్కల ప్రకారం నిబంధనలు యాక్టివేట్ కాలేదు. ఫ్రెంచ్ ఓపెన్ (French Open) చరిత్రలో ఈ పాలసీని ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాడలేదు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం ఎండ ఎక్కువైతే రూఫ్ మూసివేసే నియమం ఉంది. గతంలో జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎండ తట్టుకోలేక ఇబ్బంది పడ్డ సినర్, రూఫ్ మూయడం వల్లే మ్యాచ్ గెలిచాడు. కానీ ఇక్కడ పారిస్‌లో ఆ సాయం అందలేదు.

ఈ ఎండలపై బుధవారం నాలుగు సెట్ల కఠిన పోరాటం తర్వాత గెలిచిన నోవాక్ జకోవిచ్ స్పందించాడు. ఫ్రెంచ్ ఓపెన్ తన నియమాలను మార్చుకోవాలా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చాడు. సెంటర్ కోర్టులో రూఫ్ మూసివేసి, మిగతా కోర్టుల్లోని ఆటగాళ్లను ఎండలో ఆడించడం ఏమాత్రం న్యాయం కాదని అభిప్రాయపడ్డాడు. దానికి బదులుగా గ్రాండ్ స్లామ్స్‌లో ఎక్కువ కోర్టులు ఉంటాయి కాబట్టి, ఎండలు ఎక్కువగా ఉన్న రోజుల్లో మ్యాచ్‌లను సాయంత్రం లేదా రాత్రి వేళలకు మార్చడం మంచిదని జకోవిచ్ నిర్వాహకులకు సూచించాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్యం, టోర్నమెంట్ నిబంధనల మధ్య సమతుల్యతపై ఇప్పుడు టెన్నిస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Read Also: సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణ స్వీకారం డేట్‌ ఫిక్స్

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>