కలం, కడెం: కడెం (Kadem) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా కేంద్రంలోని స్వప్న మల్టీస్పెషల్టీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైద్యులు గుండె, ఎముకలు, కీళ్లకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు ఈసీజీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రి ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నాలం శశికాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

