కలం, యాదగిరిగుట్ట: వరుస సెలవులు, వారాంతం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి (Yadadri Temple) భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. దీంతో ఆలయ క్యూలైన్లు, మాడ వీధులు, లడ్డూ ప్రసాద కౌంటర్లు, కొండపై వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. బస్టాండ్ ప్రాంగణంతో పాటు కొండపై ఉన్న వాహనాల పార్కింగ్ ప్రాంతాలు వాహనాలతో పూర్తిగా నిండిపోయాయి. ధర్మ దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది. రూ.150 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లలో తాగునీటి సదుపాయం, నిరంతర ప్రసాద పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు.

