కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 102 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉంచొద్దు
సీఎం ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అలాగే మండలస్థాయి ప్రజావాణి దరఖాస్తులను కూడా పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి, వాటి వివరాలను ప్రజావాణి ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. త్వరలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున, అధికారులు దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జనగణనపై సమీక్ష
ప్రజావాణిలో మున్సిపల్, ఎక్సైజ్, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ, గృహ నిర్మాణం, భూసర్వే రికార్డులశాఖ, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ , సంక్షేమశాఖ, పరిశ్రమలశాఖ, కార్మిక, విద్య, వైద్య ఆరోగ్యం, విద్యుత్, మైనింగ్, నీటిపారుదుల, పోలీసు శాఖలకు సంబంధించిన 104 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రజావాణి అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ జిల్లాలో నమోదుతున్న జనాభా గణన (సెన్సస్) పురోగతిపై వెబెక్స్ ద్వారా మండల తహసీల్దార్లతో సమీక్షించారు. జనగణనలో భాగంగా మొదట విడత హౌస్ లిస్టింగ్ ఎన్యూమరేషన్ మండలంలో మున్సిపాల్టీలో సోమవారం సాయంత్రం వరకు వంద శాతం పూర్తిచేయాలని మండల తహసీల్దార్లను ఆదేశించారు.
82.17 శాతం జనగణన పూర్తి
ఇప్పటివరకు జిల్లాలో 82.17 శాతం జనగణన పూర్తయిందని అన్నారు. హన్వాడ, చిన్న చింత కుంట, మహమ్మదాబాద్, గండీడ్ మండలాలు, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీలు సెన్సస్ నమోదులో ఎనకపడి ఉన్నాయని, ఆయా మండలాల తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్ 100 శాతం పూర్తిచేసి సమర్పించాలని ఆదేశించారు. ప్రక్రియలో ఎక్కడైనా ఆన్లైన్ డేటా అప్డేట్ చేయడంలో సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తితే వాటిని మండల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారితో సమన్వయపర్చుకొని పరిష్కరించాలని అన్నారు. అలాగే మున్సిపాలిటీల కమిషనర్లతో మాట్లాడి మున్సిపాలిటీలలో కూడా వంద శాతం పూర్తి చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆదేశించారు,
బడిబాట కార్యక్రమంపై ఆరా!
బడిబాట కార్యక్రమంపై హరిప్రియ సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) పెంపునకు చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని విద్యాశాఖతోపాటు ఇతరశాఖల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల హాజరు నమోదుశాతం ఆశించిన స్థాయిలో లేదని తెలిపారు. బడిబాట కార్యక్రమం ద్వారా ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచేందుకు అన్నిశాఖల సమన్వయం అవసరమని తెలిపారు. ముఖ్యంగా జిల్లా సంక్షేమశాఖ, కార్మికశాఖ, ఇతర సంక్షేమ శాఖలు, అలాగే మండల స్థాయిలో ఎంపీడీవోలు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు
ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకం కింద విద్యార్థులకు పోషకాహారంతో కూడిన రాగిజావ, పాలు అల్పాహారంగా ఇవ్వనున్నారని తెలిపారు అలాగే ప్రీ-ప్రైమరీ పాఠశాలల ప్రారంభం, వాటి ప్రయోజనాల గురించి కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ అంశాలను గ్రామసభలు, మండల స్థాయి సమావేశాలు, ఇతర ప్రజా వేదికల ద్వారా అధికారులు ప్రజలకు తెలియజేయాలని ఆమె పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించి, బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ హరిప్రియ ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత శిక్షణ
విద్యాశాఖ అధికారి విజయ కుమారి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఏప్రిల్ 24 నుండి బడి బాట కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. గత నెల (మే)లో బడిబాట కార్యక్రమాన్ని మూడు విడతలుగా నిర్వహించామని తెలిపారు. మే 2వ తేదీ నుంచి పల్లెలో గ్రామసభలు ద్వారా, మండలాలలో మండల స్థాయి సమావేశాల ద్వారా, అలాగే జిల్లా స్థాయి సభల ద్వారా బడిబాట కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించినట్టు పేర్కొన్నారు. గత ఏడాది, ఈ ఏడాది కొత్త ప్రీ-ప్రైమరీ పాఠశాలలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా, జిల్లాలోని 75 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత శిక్షణను విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న నూతన కార్యక్రమాలు, ప్రోత్సాహక పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారుల సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, డీఆర్వో నిర్మల, జెడ్పీ సీఈవో ఇంచార్జి డీపీవో వెంకట రెడ్డి, డీఆర్‌డీవో నరసింహులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

