కలం, వెబ్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026లో (France vs Paraguay) ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫిలడెల్ఫియాలో తీవ్ర ఉక్కపోత, ఎండ వేడిమి మధ్య జరిగిన ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో పరాగ్వేపై 1-0 తేడాతో విజయం సాధించింది. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) పెనాల్టీ ద్వారా చేసిన ఏకైక గోల్ జట్టుకు విజయాన్ని అందించింది.
ఆరంభం నుంచే గొడవలు..
ఆరంభం నుంచే మ్యాచ్ రసవత్తరంగా సాగింది. పరాగ్వే డిఫెండర్లు అగ్రెసివ్ గేమ్, టైట్ మ్యాన్ మార్కింగ్‌తో ఫ్రాన్స్ ఫార్వర్డ్ లైన్‌ను కట్టడి చేశారు. ఎంబాపే, డెంబెలే, మైఖేల్ ఒలిస్ వంటి స్టార్ అటాకర్లకు గోల్ స్కోరింగ్ అవకాశాలు దక్కకుండా అడ్డుకున్నారు. పరాగ్వే ప్లేయర్ ఆండ్రెస్ క్యూబాస్ ఫౌల్ ట్యాకిల్‌పై ఎంబాపే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇరు జట్లు 0-0తో సమంగా నిలిచాయి
పెనాల్టీ స్పాట్‌ను పాడుచేసే ప్రయత్నం
సెకండ్ హాఫ్ లో పరాగ్వే డిఫెండర్ డియాగో గోమెజ్ చేసిన ఫౌల్ పై రెఫరీ ఫ్రాన్స్‌కు పెనాల్టీ ఇచ్చాడు. ఆ సమయంలో పరాగ్వే ఆటగాళ్లు రెఫరీని చుట్టుముట్టి గొడవకు దిగడమే కాకుండా, డిఫెండర్ గుస్తావో వెలాస్క్వెజ్ కిక్ తీసే పెనాల్టీ స్పాట్‌ను తన బూట్లతో తవ్వి పాడుచేయడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఎంబాపే కూల్ క్లినికల్ ఫినిషింగ్‌తో గోల్గా మార్చి ఫ్రాన్స్‌కు 1-0తో కీలక ఆధిక్యాన్ని అందించాడు. చివరి నిమిషం వరకు పరాగ్వే స్కోరు సమం చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫ్రాన్స్ డిఫెన్స్ లైన్ విజయవంతంగా అడ్డుకుంది.
ఎంబాపేపైకి బంతి.. ఉద్రిక్తత
మ్యాచ్ ముగిశాక పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండో గిల్ హ్యాండ్ షేక్ కోసం ముందుకు రాగా, ఎంబాపే పట్టించుకోకుండా వెళ్లాడు. దీంతో కోపానికి గురైన కీపర్ గిల్.. ఎంబాపే వీపుపైకి బంతిని విసిరి కొట్టడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. పరాగ్వే ఆటగాళ్లు మ్యాచ్ అంతటా రఫ్ ఫౌల్స్ చేస్తూ, ఫ్రాన్స్ ప్లేయర్లను కించపరిచేలా ప్రవర్తించినా ఉజ్బెకిస్తాన్‌కు చెందిన రెఫరీ ఇల్గిజ్ టాంటాషెవ్ ఒక్క పరాగ్వే ప్లేయర్‌కు కూడా ఎల్లో కార్డ్ ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

