కలం , జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్లో మూడు రోజులపాటు నిర్వహించిన 54వ జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డ్స్ పోటీల్లో కండ్లపల్లి మోడల్ స్కూల్ (Kandlapally Model School ) విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ విభాగాల్లో అద్భుతమైన ప్రాజెక్టులను ప్రదర్శించి బహుమతులు సాధించడంతో పాటు, ఇద్దరు విద్యార్థుల ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్‌కు ఎంపికయ్యాయి. గైడ్ టీచర్ సి. శివకృష్ణ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థి సంద రిషి వర్ధన్ రూపొందించిన ‘అడ్వాన్స్డ్ బౌల్స్ లిఫ్టింగ్ అండ్ క్యారీయింగ్ టూల్’ పదో తరగతికే చెందిన పడాల వర్షిత్ రూపొందించిన ‘మల్టీపర్పస్ ఫిల్లింగ్ అండ్ క్యారీయింగ్ మెషిన్’ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ పోటీలకు ఎంపికయ్యాయి. అదేవిధంగా రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో హెల్త్, హైజీన్, శానిటేషన్ విభాగంలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఆర్.హర్యక్ష మొదటి బహుమతిని సాధించగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో తొమ్మిదో తరగతి విద్యార్థి సిహెచ్.మహత్ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాడు. విద్యార్థులు సాధించిన విజయాల పట్ల పాఠశాల ప్రిన్సిపల్ డి.సరితా దేవి, వైస్ ప్రిన్సిపల్ నాగేష్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులతో పాటు గైడ్ టీచర్ సి. శివకృష్ణను అభినందించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని, సృజనాత్మకతను పెంపొందించే దిశగా వారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

