కలం, వెబ్ డెస్క్: హింసతో ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం లభించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రజల ఆకాంక్షలు కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలోనే నెరవేరుతాయని చెప్పారు. ఉద్యమాన్ని వీడి, జన జీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేతలతో శుక్రవారం సచివాలయంలో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ల విజ్ఞప్తి మేరకు ఏర్పాటుచేసిన సమావేశంలో సుదీర్ఘంగా ముఖాముఖి అనేక అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు అడవుల్లో గడిపి, తిరిగి ప్రజాస్వామ్యంపై నమ్మకంతో వెనక్కు రావడం అభినందనీయమన్నారు.
జన జీవన స్రవంతిలో కలిసినవాళ్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి రక్షణ, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోటూ లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పునరావాస విధానాలు పరిశీలించి, వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఉద్యమాలను వదిలి, సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చిన వారికి మరింత మెరుగైన ప్యాకేజీ అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి.. ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి మాజీ మావోయిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.
రెండేళ్లలో 591 మంది జనంలోకి : డీజీపీ
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్ఐబి(ఇంటెలిజెన్స్) ఐజీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల పునరావాస పురోగతిని సీఎంకు వివరించారు. ప్రభుత్వం పిలుపు మేరకు గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 591 మంది మావోయిస్టులు జనజీవ స్రవంతిలో కలిసినట్లు వివరించారు. వీళ్లంతా సాధారణ పౌరులుగా, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జీవిస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పోలీసు శాఖ కృషి, మెరుగైన పునరావాస విధానాల కారణంఆ మావోయిస్టు అగ్రనేతల్లోనూ మార్పు వచ్చిందని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రిని (Revanth Reddy) కలిసిన వారిలో మాజీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ అలియాస్ రమేష్ అలియాస్ సంజీవ్ అలియాస్ చేతన్ అలియాస్ కుమ్మ దాదా(సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్), మాజీ సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న అలియాస్ చంద్రన్న అలియాస్ సోమన్న, పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ మైనాబాయి అలియాస్ మైనక్క అలియాస్ సుజాతతో పాటు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రాహుల్ ఉన్నారు.

