కలం, వెబ్‌డెస్క్: వరుస ఓటములతో కుదేలవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుపై భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (Srikanth) విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా యువ బ్యాటర్ ఆయుష్ బదోనీ (Ayush Badoni) ఆటతీరు, జట్టు యాజమాన్యం నిర్ణయాలు అస్సలు బాలేవని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న లక్నో, ప్లే ఆఫ్ రేసు నుండి దాదాపు నిష్క్రమించిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లక్నో జట్టు పరిస్థితిపై శ్రీకాంత్ మాట్లాడుతూ.. బదోనీకి కనీసం ఇన్నర్ సర్కిల్ దాటి షాట్లు కొట్టే సామర్థ్యం కూడా లేదని విమర్శించారు. ఐదేళ్లుగా జట్టులో ఉంటున్న అతడికి కేవలం రెండు షాట్లు మాత్రమే వచ్చని ఎద్దేవా చేశారు.
కేవలం సగటు గణాంకాలను చూసి ఆటగాళ్లను ఎంపిక చేయడం పెద్ద తప్పని అభిప్రాయపడ్డారు. ప్రముఖ కోచ్‌లు ఉన్నప్పటికీ లక్నో జట్టులో ఎటువంటి పురోగతి లేదని శ్రీకాంత్ అన్నారు. బౌలింగ్ విభాగం బాగున్నా, మిగతా అంతా అయోమయంగా ఉందని పేర్కొన్నారు. బదోనీని ఓపెనర్‌గా పంపడం, ఫామ్‌లో లేని రింకూ సింగ్ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఇవ్వడం వంటి నిర్ణయాలు జట్టు బలహీనతకు నిదర్శనమని చెప్పారు. పంత్ కెప్టెన్సీలో జట్టుకు దిశానిర్దేశం కరువైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో బదోనీ ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం 21.50 సగటుతో పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అతడిని జట్టు నుండి తప్పించారు. అయినప్పటికీ లక్నో తలరాత మారలేదు. ఆ మ్యాచ్‌లోనూ ఓడిపోయి, ఈ సీజన్‌లో వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుందని శ్రీకాంత్ (Srikanth) అన్నారు.
Read Also: విజయ్ గెలుపు వెనుక ఉన్నదెవరో తెలుసా?
Follow Us On : WhatsApp

