Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ గెలుపు వెనుక ఉన్నదెవరో తెలుసా?

కలం, తెలంగాణ బ్యూరో : తమిళనాట సినీ నటుడు విజయ్ అనూహ్య విజయం అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులనే విస్మయానికి గురిచేసింది. ఈ విజయం వెనుక కారణమేంటనే చర్చ మొదలైంది. ఒకప్పుడు ఐ-ప్యాక్‌లో పనిచేసి ఇప్పుడు సొంతంగా ఏజెన్సీ పెట్టుకున్న వ్యూహకర్త కపిల్ సాహు (Kapil Sahu) వ్యూహాలే విజయ్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాయన్నది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పనిచేసిన కపిల్ సాహుల్ రెండేండ్ల నుంచి విజయ్ పార్టీ (TVK) కి పనిచేశారు. డజను మందితో క్షేత్రస్థాయిలో పర్యటించి తమిళనాడులోని ప్రజల నాడిని పసిగట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహణ మొదలు మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం వరకు కపిల్ సాహు పాత్రే కీలకమైనదని టీవీకే కార్యకర్తలు ఆలస్యంగా వెల్లడించారు. ఎవరీ కపిల్ సాహు అంటూ తమిళనాట చర్చ మొదలైంది.

ప్రశాంత్ కిషోర్ దగ్గర శిక్షణ, అనుభవం :

ఎన్నికల వ్యూహరచనలో పదేళ్లకు పైగా అనుభవం ఉన్న కపిల్ సాహు గతంలో ఐ-ప్యాక్‌ సంస్థలో పనిచేశారు. ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో కీలక పాత్ర పోషించారు. డజను మంది సహచరులతో కలిసి ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి స్వంత సంస్థను ప్రారంభించారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్, బీజేపీ తదితర పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. విజయాలను నమోదు చేసుకోవడంతో రెండేండ్ల క్రితం విజయ్ పార్టీకి పనిచేయడం ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని విజయ్ ఎన్నికల విజయ ప్రయాణానికి వ్యూహాలు రచించారు. ప్రచార ప్లాన్‌కు తగినట్లుగా ఏర్పాట్లు చేసినా కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 41 మంది మరణించడం, 80 మందికి పైగా గాయాలు కావడం పార్టీని ఇరకాటంలో పడేసింది. విజయ్ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలు, ఆయన భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం లాంటి పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి.

యూత్, మహిళా ఓటర్లే ప్రధాన టార్గెట్ :

ప్రతికూలతలను కూడా అనుకూలతలుగా మార్చుకోవడమే అసలైన వ్యూహం అని బలంగా విశ్వసించే కపిల్ సాహు… తమిళనాడులోని పబ్లిక్ నాడిని పసిగట్టారు. యూత్, మహిళలను ఆకర్షించగలిగితే తిరుగులేని విజయం సాధ్యమవుతుందని నమ్మి దానికి తగిన వ్యూహాన్ని రూపొందించారు. పక్కా డేటా విశ్లేషణ, ప్రజల్లోకి చొచ్చుకెళ్ళే నెరేటివ్ సెట్టింగ్, సినీ నటుడిగా విజయ్ పట్ల ఉన్న అభిమానం, క్రేజ్‌ను ఓట్లుగా మలచడానికి అనుసరించే వ్యూహం.. వీటన్నింటిలో కపిల్ సాహు సక్సెస్ అయ్యారు. విజయ్ చుట్టూ కరూర్ ఘటన వివాదంతో పాటు భార్య సంగీత విడాకుల కేసు వివాదం చుట్టుముట్టడంతో సోషల్ మీడియా వేదికగా సానుకూల వాతావరణానికి మార్గాన్ని అన్వేషించారు. యువతను, మహిళా ఓటర్లను ఆకర్షించేలా వ్యూహాలు రచించారు. విజయ్ విజయంలో ఆ ఓటు బ్యాంకే కీలకంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>