కలం, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం కొలిక్కి వచ్చింది. మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న చిన్నమల్లయ్య (Chinnamallayya).. ఈరోజు తెల్లవారుఝామునే పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ కేసు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చిన్నమల్లయ్య.. ఎట్టకేలకు నెల రోజుల తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయారు.
వినుకొండ మండలంలోని ఓ గ్రామంలో ఒంటరిగా ఉన్న సమయంలో తనపై అత్యాచారం చేశాడని చిన్నమల్లయ్యపై ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తనను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తన కుటుంబం నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారం వ్యవహారంలో చిన్నమల్లయ్య పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 29న వినుకొండ రూరల్ పోలీసు స్టేషన్ లో అతనిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారడంతో చిన్నమల్లయ్యను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసు ముందస్తు బెయిల్ కోసం ఇటు మొదట హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టుల నుంచి ఊరట లభించకపోవడంతో ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియక చిన్నమల్లయ్య తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసుల గాలింపు, మరోవైపు కోర్టుల్లో ఎదురుదెబ్బలు, ఉద్యోగం కోల్పోయిన పరిణామాల మధ్య చిన్నమల్లయ్య చివరకు అజ్ఞాతం వీడారు. ఈ నేపథ్యంలో ఆయన వినుకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకుని లొంగిపోయారు. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణను ముమ్మరం చేస్తున్నారు.

