కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ జిల్లా మంత్రుల హవా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కొరవడటంతో గతంలో జిల్లాను శాసించిన పలువురు కీలక నేతలు ఇప్పుడు ‘సైలెంట్ మోడ్’లోకి వెళ్లిపోయారనే చర్చ జరుగుతోంది. అయితే ఇది వ్యూహాత్మక మౌనమేనా.. ప్రస్తుతం వారంతా ఏం చేస్తున్నారనే ఆసక్తి నెలకొంది.
వ్యాపారాలపై శ్రద్ధ పెట్టిన కీలక నేతలు..
కేసీఆర్ హయాంలో ఖమ్మం (Khammam) జిల్లా రాజకీయాలు పూర్తిగా పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావు చుట్టూనే తిరిగేవి. రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పారు. గత ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా అనుచరులు కొంత హడావిడి చేశారు. పువ్వాడకు మమత హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ వంటి విద్యాసంస్థలు ఉండటంతో ప్రస్తుతం వాటి నిర్వహణపైనే పూర్తి శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నారు.
ఇక ఎంపీగా ఖమ్మం నుంచి ఢిల్లీ వరకు కీలకంగా వ్యవహరించిన నామా నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగానూ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం, అప్పటివరకు వెంట ఉన్న క్యాడర్ కాంగ్రెస్ వైపు వెళ్లడంతో పొలిటికల్‌గా నెమ్మదించారు. తన మధుకాన్ గ్రూప్ వ్యాపార వ్యవహారాలకే పరిమితమైనట్లు జిల్లా నేతలు చెప్పుకుంటున్నారు.
వారు కూడా అదే దారిలో..
కీలక నేతలు అలా ఉంటే.. కొత్తగూడెం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలు కూడా ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయించారనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో పాటు అనారోగ్య సమస్యలు, కుమారుడి చుట్టూ నడిచిన వివాదాలతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. పాలేరులో బలమైన ఆర్థిక, సామాజిక పట్టున్న కందాల ఉపేందర్ రెడ్డి సైతం సొంత వ్యాపారాల్లో బిజీ అయిపోయారని స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడి నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటం, తన అనుచరులు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడంతో కందాల ఒంటరి అయిపోయారు.
సత్తుపల్లిలో హ్యాట్రిక్ రికార్డు సృష్టించిన సండ్ర వెంకట వీరయ్య కూడా గత ఓటమి తర్వాత కాంగ్రెస్ దూకుడు తట్టుకోలేక పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఇక మాజీ సీఎం జలగం వెంగళరావు వారసుడిగా బలమైన క్యాడర్ ఉన్న జలగం వెంకటరావు గతంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలతో నష్టపోయారు. ప్రస్తుతం అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల్లో గ్రూపు రాజకీయాల కారణంగా ఆయన కూడా మౌనంగా ఉండిపోయారు.
ఎన్నికల నాటికి యాక్టివ్ మోడ్‌లోకి..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతినడంతో ద్వితీయ శ్రేణి లీడర్లు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. క్యాడర్ లేకపోవడంతో పాటు నేతలంతా వ్యాపారవేత్తలు, విద్యాసంస్థల అధినేతలు కావడంతో ప్రభుత్వంతో ఎందుకొచ్చిన గొడవ.. అనే ఉద్దేశంతో ‘రాజకీయ విరామం’ ప్రకటించారా.. అనే అనుమానాలు పార్టీలో కలుగుతున్నాయి. అయితే, ఇదంతా తాత్కాలికమేనని వచ్చే ఎన్నికల నాటికి అందరూ యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లిపోతారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని బీఆర్ఎస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ఖమ్మం లాంటి రాజకీయ చైతన్యవంతమైన జిల్లాలో నాయకులు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది.
Read Also: ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు: కిషన్ రెడ్డి
Follow Us On: Instagram

