కలం, కరీంనగర్ బ్యూరో: అధికారంలోకి వచ్చేముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలలో భాగంగా వృద్దాప్య , బీడీ కార్మికులకు కూడా ఇవ్వాల్సిందేనని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (Thimmapur ) మండల బీజేపీ మాజీ అధ్యక్షులు, న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి సోమవారం నాటి పత్రికా ప్రకటన లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వివిధ రకాల పెన్షన్ లను పెంచి ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు.
పెన్షన్లపై రెండున్నరేళ్ళుగా మభ్యపెడుతూ చివరికి పెంపు చేయకుండా.. వృద్దాప్య, బీడీ కార్మికుల పెన్షన్ లపై స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం పెన్షన్ ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కు వెళ్లిన వృద్దులకు, బీడీ కార్మికులకు సంబందించి సైట్ లో అప్షన్ కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ లో కూడా వృద్దాప్య, బీడీ కార్మికుల వివరాల నమోదు గురించి చెప్ప లేదని తెలిపారు. ఈ రెండు రకాల పెన్షన్ లపై దరఖాస్తు లు తీసుకుంటున్నారా? లేదా? సైట్ లో పొందుపరిచే విషయంలో సాంకేతిక పొరపాటు ఏమైనా జరిగిందా? అనే విషయంపై స్పష్టంగా తెలపాలన్నారు. అలాగే ఈ ఆగస్టు 15న ఇస్తామంటున్నటువంటి పెన్షన్ లు పెంచే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

