నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు.. రైతుల్లో ఆశలు!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam Project) భారీ వరద నీటితో నిండుకుండలా మారింది. పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, సోమవారం రాత్రి నాటికి 182 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878 అడుగులు వద్ద ఉంది. ఆదివారం ఉదయం నుంచి జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో వరద ప్రవాహం భారీగా తగ్గింది.

వారం రోజులుగా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. జూరాల ప్రాజెక్టు, సుంకేశుల బ్యారేజీ నుంచి శ్రీశైలానికి వరద వచ్చి చేరింది. గరిష్ఠంగా 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో 23,455 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

విద్యుత్ ఉత్పత్తి ముమ్మరం..

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరగడంతో విద్యుత్ ఉత్పత్తిని ముమ్మరం చేశారు. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. అలాగే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో తెలుగు రాష్ట్రాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్, కృష్ణా డెల్టా పరిధిలో సాగు నీరు, రాయలసీమ తాగు నీటి అవసరాలకు ఈ నీరు భరోసా ఇస్తోందన్నారు.

జూరాల గేట్లు మూసివేత..

ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల లేకపోవడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను మూసి ఉంచారు. దీంతో జూరాలలో పవర్ జనరేషన్ కోసం ఉపయోగించే నీటిని మాత్రమే కిందికి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో వర్షాలు పడితే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌లోకి వదులే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>