కలం, వెబ్ డెస్క్ : భాగ్యనగరంలో వినాయక నిమజ్జనోత్సవం (Ganesh Immersion) వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖైరతాబాద్ నుంచి బయలుదేరే ఈ శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ వైపు కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి బడా గణేష్ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకోనుండగా, మధ్యాహ్నం 1:30 గంటలలోపే నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అందుకోసం సాగర్ తీరంలో క్రేన్ నంబర్-4ను సిద్ధంగా ఉంచారు. శోభాయాత్ర సాగే మార్గమంతటా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మరోవైపు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట నేడు నిర్వహించనున్నారు. గతేడాది ఈ లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో రూ.35 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. ఉదయం బాలాపూర్ గ్రామ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత శోభాయాత్ర మొదలవుతుంది. ఉదయం 9 గంటలకు గణపయ్య బొడ్రాయి వద్దకు చేరుకోగా, ఉదయం 9:30 గంటలకు ఉత్కంఠభరితమైన లడ్డూ వేలం పాట ప్రారంభం కానుంది.

