కలం, వెబ్‌డెస్క్: నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది. శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఫరాదాబాద్ చౌరస్తా సమీపంలో మంటలు వ్యాపించాయి. సలేశ్వరం జాతర (Saleshwaram Jatara)కు సమీపంలో గల అటవీ ప్రాంతంలో మంటలు అంటుకోవడంతో అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఓ వైపు సలేశ్వరం జాతర ముగింపు సమయంలో మంటలు చెలరేగడం గమనార్హం. ఎండల తీవ్రత, పొడి గాలుల కారణంగా మంటలు వేగంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫారెస్ట్ సిబ్బంది అగ్నిమాపక చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల అగ్నిమాపక వాహనాలు చేరుకోలేని పరిస్థితుల్లో సిబ్బంది మానవ శక్తితోనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటనతో శ్రీశైలం మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంటలు రహదారి పక్కనికి వ్యాపించే అవకాశముండటంతో ట్రాఫిక్‌పై కూడా ప్రభావం పడే అవకాశముంది. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో వరుసగా కార్చిచ్చు ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదాల వల్ల వందల హెక్టార్లలో అడవి దగ్ధమవుతోందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. విలువైన వృక్ష సంపదతో పాటు అడవి జీవజాలానికి కూడా తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు. కార్చిచ్చు ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

