కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై సగటున రూ. 50,000 ఖర్చవుతుంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. 1,08,000 ఖర్చు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఇంత ఖర్చు చేస్తున్నా, ఆరో తరగతి విద్యార్థి కనీసం మూడో తరగతి పుస్తకాన్ని కూడా చదవలేకపోవడం విద్యావ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాను కలలుగన్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ ద్వారా నాణ్యమైన విద్యను అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఏవీఎన్ (AVN) ‘లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్’ చూసినప్పుడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎలా ఉండాలని తాను భావించానో, సరిగ్గా అలాగే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

