ఈ 7 ఆహారాలను మళ్లీ వేడి చేయొద్దు.. నిపుణుల హెచ్చరిక

కలం, వెబ్‌డెస్క్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో దాచుకుని మళ్లీ అవసరం అయినప్పుడు వేడి చేసుకొని తినడం కొంతమందికి అలవాటుగా మారిపోయింది. ఆహారాన్ని వేడిగా తినడం మంచిదే అయినప్పటికీ.. కొన్ని రకాల పదార్థాలు మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

అయితే వంటకాలు రెండోసారి వేడిచేసినప్పుడు వాటిలోని పోషకాలు నశించడమే కాకుండా, రసాయన మార్పులు జరిగి అవి విషపూరితంగా మారుతాయట. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతినడం, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎటువంటి ఆహార పదార్థాలు అస్సలు వేడిచేయకూడదు, ఆహార భద్రత చిట్కాలు (Food Safety Tips) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడి చేయకూడని ఆహార పదార్థాలు

1. ఆకుకూరలు

పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయట. అయితే వేడి చేయడం చేసినప్పుడు హానికర నైట్రేట్లుగా మారి, ఆపై కార్సినోజెనిక్ సమ్మేళనాలుగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే వండిన ఆకుకూరలను రెండవ సారి వేడి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

2. అన్నం

ఈ రోజుల్లో వండిన అన్నాన్ని కావలసినప్పుడు వేడి చేసుకుని తినడం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినపుడు అందులో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుందట. ఈ అన్నాన్ని మళ్లీ వేడిచేసినప్పుడు ఆ బ్యాక్టీరియా లేదా అది విడుదల చేసే విషపూరిత పదార్థాలు నశించవు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.

3. గుడ్లు

గుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అయితే ఒకసారి ఉడికించిన గుడ్లను మళ్లీ వేడిచేయడం వలన అందులోని ప్రోటీన్ల నిర్మాణం దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

4. మాంసాహారాలు

మాంసాహారంలో సంక్లిష్టమైన ప్రోటీన్ నిర్మాణాలు ఉంటాయి. ముఖ్యంలో చికెన్‌లో కూడా ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. చికెన్‌ను పదే పదే వేడి చేయడం వల్ల అందులోని ప్రొటీన్ల అమరిక పూర్తిగా మారిపోతుంది. ఇలాంటి మాంసాన్ని తినడం వల్ల జీర్ణక్రియ మందగించడంతో పాటు గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

5. బంగాళదుంప

వండిన బంగాళదుంపలను ఎక్కువసేపు బయట ఉంచితే దానిపై క్లోస్ట్రిడియం బొటులినమ్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట. దీన్ని మళ్లీ వేడి చేస్తే బ్యాక్టీరియా నశించకపోగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

6. పుట్టగొడుగులు

పుట్టుగొడుగులను వండిన వెంటనే తినేయాలని సూచిస్తున్నారు నిపుణులు. పుట్టగొడుగులో ఉండే ప్రోటీన్లు చాలా తొందరగా పాడైపోతాయట. వీటిని మళ్లీ వేడిచేయడం వలన అవి విషతుల్యంగా మారతాయి. ఇవి తినడం వలన జీర్ణ, ఉదర సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

7. వంట నూనె

ఒకసారి వాడిన వంట నూనెను పదే పదే వేడిచేయడం వల్ల చాలా ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల అందులో ఫ్రీ రాడికల్స్ విడుదలై గుండె జబ్బులు, క్యాన్సర్, శరీరంలో వాపులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆహార నిల్వ.. పాటించాల్సిన జాగ్రత్తలు
  • వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదు.
  • మిగిలిపోయిన ఆహారాన్ని వండి రెండు గంటలలోపు ఫ్రిజ్ లో పెట్టాలి.
  • ఫ్రిజ్ లో నుంచి తీసిన ఆహారాన్ని పదే పదే వేడి చేయొద్దు.
  • ఒకవేళ ఆహారాన్ని వేడిచేస్తే కేవలం పైపైనే కాకుండా లోపలి వరకు పూర్తిగా వేడిచేయాలి. అప్పుడే అందులోని సూక్ష్మజీవులు పూర్తిగా నశిస్తాయట. అలా కాకుండా సగం సగం వేడి చేసిన ఆహార పదార్థాలను తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>