కలం, వరంగల్ బ్యూరో : వరంగల్(Warangal) పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ (Sunpreet Singh) పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల(KMC) లో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయి వినియోగదారులను మాత్రమే పట్టుకోవడం సరిపోదని, సరఫరా చేసే వారిని గుర్తించి అరెస్టు చేయడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అక్రమ ఇసుక రవాణా, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం దుర్వినియోగం, పేకాట, బెట్టింగ్ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా కట్టడి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో పేకాటరాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్థానిక పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరును కమిషనర్ సమీక్షించారు. చోరీలు అధికంగా జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రజల భాగస్వామ్యంతో కాలనీల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఉన్న కెమెరాలను జియోట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని తెలిపారు. అదేవిధంగా రాబోయే హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతలు కాపాడేందుకు ముందస్తు ప్రణాళికలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

