కలం, వెబ్ డెస్క్: ప్రతిఏటా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పంపిణీ చేయనున్న చేపపిల్లల ప్రసాదం (Fish Prasadam Distribution)పై ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. బత్తిని కుటుంబం ఏటా అందించే చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైనట్లు వివరించారు. గత ఏడాది కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ముఖ్యంగా లక్షా 25 వేల చేప పిల్లలను సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. అవసరమైతే అదనపు నిల్వలను కూడా ఉంచాలని ఫిషరీస్ శాఖను ఆదేశించారు. తోపులాటలు జరగకుండా 35 కౌంటర్లు, పటిష్టమైన బారికేడ్లు ,సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్, ట్రాఫిక్, జిహెచ్‌ఎంసీ, మెడికల్ ,విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఏర్పాట్లతో పాటు అగర్వాల్ సమాజ్, జైస్వాల్ సమాజ్, బత్తిని ట్రస్ట్‌లు యధావిధిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

