కలం, వెబ్‌డెస్క్ : Goa Fire Accident | గోవాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఆర్పోరా ప్రాంతంలోని ఓ నైట్ క్లబ్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో 25 మంది మృతి చెందారు. ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు. మృతుల్లో నైట్ క్లబ్ సిబ్బందితో పాటు టూరిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరగోవాలో ఉన్న గ్రిచ్ అనే నైట్ క్లబ్‌లోని కిచెన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ కారణంగా ప్రమాద తీవ్రత పెరిగింది.
అగ్నిప్రమాదం (Fire Accident) సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్ప్రత్రులకు తరలించారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ (Goa CM Pramod Sawant) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం గోవా ప్రజలందరికీ ఇది చాలా బాధాకరమైన రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన సీఎం, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
కాగా, నైట్ క్లబ్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారు? నిబంధనులు ఎలా ఉల్లంఘించారు? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టాలని సీఎం ప్రమోద్ సావంత్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో క్లబ్ యజామానులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం ప్రకటించారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ.. గోవా సీఎం కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధితులను ఆదుకోవాలని సూచించారు.


