కలం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ (IPL) పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఊహించని రీతిలో విరుచుకుపడింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఛేదించారు. ముఖ్యంగా ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో 14.2 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి కోల్‌కతా అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభం బాగానే ఉన్నా, తర్వాత తడబడింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరిసినా, మిగిలిన టాప్ ఆర్డర్ విఫలమైంది. కెఎల్ రాహుల్ (23) కాసేపు పోరాడితే, చివర్లో అశుతోష్ శర్మ (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి తలో రెండు వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశారు. సునీల్ నరైన్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఫిన్ అలెన్ ఊహించని ఊపునిచ్చాడు. అజింక్య రహానే (13), రఘువంశీ (1) త్వరగానే పెవిలియన్ చేరినా.. అలెన్ మాత్రం తగ్గలేదు. కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు (5 ఫోర్లు, 10 సిక్సర్లు) బాది అజేయంగా నిలిచాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడికి తోడుగా కామెరాన్ గ్రీన్ (33 నాటౌట్) నిలవడంతో కేకేఆర్ మరో 34 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగలిగాడు. భారీ ఆశలు పెట్టుకున్న మిచెల్ స్టార్క్ 3 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ సైతం ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో కోల్‌కతా విజయం నల్లేరుపై నడకలా సాగింది. మొత్తం మీద ఫిన్ అలెన్ ‘వన్ మ్యాన్ షో’తో ఢిల్లీ కథ ముగిసింది.

