కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) ఆకాక్షించారు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్ (Nizamabad) లోని కిషన్ గంజ్‌లో వేడుకలు నిర్వహించారు. వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే ధన్ పాల్ అమ్మవారికి ఆభరణాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం సంతోషమని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆర్య వైశ్యులు ఎప్పుడు ముందుంటారని పేర్కొన్నారు.
వైభవంగా శోభాయాత్ర
ఇందూరు నగరంలోని పెద్ద బజారులో గల నగరేశ్వర దేవాలయం వద్ద ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. శివాజీ నగర్ పెద్ద బజార్ గాంధీ చౌక్ మీదుగా కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. ఒగ్గు కళాకారులు, పులి వేషాలు, బోనాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది.
ఘనంగా డోలారోహణ
ఇందూరు నగరంలోని కిషన్ గంజ్ వాసవి మాత ఆలయంలో అమ్మవారి నామకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) తో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా వాసవి మాతకు నామకరణం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు పాల్తే రవి కుమార్, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, కోశాధికారి మామిడి శేఖర్, పట్టణ సంఘం అధ్యక్షుడు ధనపాల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

