కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో రేపు ( సోమవారం) ఎరువుల షాపులు బంద్ కానున్నాయి. కేంద్రం, ఎరువుల ఉత్పత్తి సంస్థలు అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్,సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ (Fertilizer Dealers Protest )కు పిలుపునిచ్చింది. డీలర్ల సమస్యలను పరిష్కరించడంలో కంపెనీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, అందుకే బంద్ పాటిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎరువుల సరఫరాలో కంపెనీలు అనుసరిస్తున్న ‘లింక్ ప్రొడక్ట్’ విధానంపై ఫైర్ అయ్యారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ (DAP) వంటి ప్రధాన ఎరువులను సరఫరా చేసే సమయంలో వాటితో పాటు రైతులకు అవసరం లేని ఇతర ఖరీదైన ఉత్పత్తులను (లింక్ ప్రొడక్ట్స్) కూడా బలవంతంగా అంటగడుతున్నాయని ఆరోపించారు. దీనివల్ల డీలర్లపై ఆర్థిక భారం పడుతుందని.. అలాగే రైతులు కూడా అనవసరమైన మందులు కొనాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే లింక్ ప్రొడక్ట్ లేకుండా ఎరువులు అందించాలని , ఎరువుల సరఫరాలో FPO (Farmer Producer Organization) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.

