Mobile Popup Ad
Mobile Popup Ad

కల్లూరులో దారుణం.. రోకలిబండతో కొట్టి కుమారుడి హత్య

కలం, ఖమ్మం బ్యూరో: వ్యసనాలకు బానిసైన తండ్రి.. తనకు అడ్డం వస్తున్నాడనే కోపంతో కన్న కొడుకునే రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన ఇది. కల్లూరు (Kalluru) పట్టణంలో చోటు చేసుకున్న ఈ హత్యోదంతం వివరాలను సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం మీడియాకు వెల్లడించారు. స్థానిక అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన కొత్తపల్లి సీతారాములు అలియాస్ జాన్ మార్క్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. గతంలో పలు నేరాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లొచ్చాడు.

ఇల్లు అమ్మాలని ప్రయత్నించి..

తన వ్యసనాలకు సరిపడా డబ్బులు లేకపోవడంతో, ఉన్న ఇంటిని అమ్మేయాలని సీతారాములు నిర్ణయించుకున్నాడు. భార్య, కుమారుడు కిరణ్ కుమార్ అడ్డు చెప్పారు. ఇల్లు ఖాళీ చేయాలని తండ్రి పలుమార్లు ఒత్తిడి తెచ్చినా కొడుకు వినకపోవడంతో, అతడిని చంపితేనే ఇల్లు అమ్ముకోవడం వీలవుతుందని భావించి హత్యకు ప్లాన్ వేశాడు.

తాగించి మరీ హత్య..

ప్రణాళిక ప్రకారం జులై 3వ తేదీ సాయంత్రం కిరణ్ కుమార్‌ను కల్లూరులోని ఒక బెల్ట్ షాప్‌నకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. అనంతరం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కిరణ్ మద్యం మత్తులో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అదనుగా భావించిన సీతారాములు రోకలిబండతో కొడుకు తలపై బలంగా మోదడంతో కిరణ్ కుమార్(30) రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం ఆటో తీసుకుని నిందితుడు పరారయ్యాడు.

ఏపీకి పారిపోయి..

​నిందితుడు రెండు రోజులుగా ఏపీకి పారిపోయి తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల్లో ఆటోలో తిరుగుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. సోమవారం ఉదయం తిరిగి కల్లూరు వైపు ఆటోలో వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంకటాపురం వద్ద సీతారాములను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన రోకలిబండ, కత్తితో పాటు ఆటోను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడిని సత్తుపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ ముత్తులింగం తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>