కలం, కరీంనగర్ బ్యూరో: శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులకు గిట్టుబాటు ధరల కోసం కాల్వ నర్సయ్య యాదవ్ (Kalva Narsaiah Yadav) నిర్వహించిన పోరాటాలు కార్మికుల కర్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. ఎవ్వరికి ఎక్కడ ఆపద వచ్చినా ఆపన్న హస్తం అందించే మానవత్వం గల మహోన్నతమైన వ్యక్తి కాల్వ నర్సయ్య యాదవ్ అని అన్నారు.
కరీంనగర్ నగరం 6వ డివిజన్ బొమ్మకల్ లో సోమవారం కాల్వ నర్సయ్య యాదవ్ 7వ వర్ధంతి కార్యక్రమం ఆయన స్థూపం వద్ద జరిగింది. లారీ అసోసియేషన్ ఆఫీసు బైపాస్ రోడ్డు చౌరస్తా వద్ద నర్సయ్య యాదవ్ విగ్రహానికి, చిత్ర పటానికి పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాల్వ నర్సయ్య యాదవ్ (Kalva Narsaiah Yadav) హమాలీ కార్మికునిగా ఆయన ప్రస్థానం మొదలు పెట్టి ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన హమాలీ సంఘంలో చేరారని.. కార్మికుల హక్కుల కోసం, వేతనాల పెంపు కోసం పోరాటాలు నిర్వహిస్తూ కార్మిక నాయకుడిగా ఎదిగాడని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలో అనేక కార్మిక సంఘాలను నెలకొల్పి వారిని చైతన్య పరుస్తూ.. కార్మిక చట్టాలను కాపాడడం కోసం, వేతనాల పెంపు కోసం అహర్నిశలు పనిచేసేవాడని అన్నారు.
సీపీఐలో గ్రామ స్థాయి కార్యదర్శి నుండి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎదిగాడని, ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పాలక ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహించిన యోధుడని అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ లో సీపీఐ పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించి నియోజకవర్గం మొత్తం పార్టీ విస్తరించడానికి ఆయన ఎంతో కృషి చేశాడని కొనియాడారు. రాష్ట్రంలో గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం స్థాపనలో కీలక భూమిక పోషించాడని అన్నారు. గొర్రెల, మేకల పెంపకపుదారుల సమస్యలపై, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశాడని వారి హృదయాల్లో కూడా నర్సయ్య యాదవ్ చిరస్థాయిగా నిలిచిన గొప్ప వాడని చెప్పారు. ఆయన ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చడానికి నేటి తరం కార్మికులు, కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు కృషి చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాల్వ నర్సయ్య కమ్యూనిస్టు పార్టీ నేతగా, కార్మిక నేతగా ఉమ్మడి జిల్లాలో కార్మికుల కోసం, కర్షకుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు.పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పరితపించే వాడని, ఎవరైనా ఆపదలో ఉండి ఆయన సహాయం కోసం వెళితే వీలైనంత సహాయం చేసి అపన్న హస్తం అందించే మంచి గుణమున్న మహానీయుడని అన్నారు. ఈ ప్రాంతంలో కార్మికులు అధికంగా ఉన్నందున ఆయన జ్ఞాపకార్థం కార్మిక భవనం నిర్మించి నర్సయ్య యాదవ్ భవన్ గా పేరు పెట్టుకుంటే సముచిత గౌరవంగా ఉంటుందని అన్నారు. భవన్ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని ఇప్పించేందుకు స్థానిక కార్పొరేటర్ కృషి చేయాలని కోరారు.
ఈ వర్ధంతి కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయినీ అశోక్, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, నలువాల సదానందం, కుటుంబ సభ్యులు కాల్వ లక్ష్మీ, శ్రీనివాస్, నవీన్, జ్యోతి, మల్లేశం, గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము అశోక్, సీపీఐ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు జంగ తిరుపతి, సాయవేణి రాయమల్లు, తంగెళ్ళ సంపత్, ఆవునూరి రమేష్, కడారి భీరయ్య, జక్కుల ఆగయ్య, చిగుళ్ల శ్రీనివాస్, అల్లేపు రాజు,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ టీ20లో మెరిసిన నిర్మల్ యువ క్రికెటర్
Follow Us On: X(Twitter)

