కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చర్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సరదాగా చేపల వేటకు వెళ్లిన తండ్రీకొడుకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మొగలిపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన రాముల సూరిబాబు (38), ఆయన కుమారుడు దేవ హర్ష కలిసి తాలిపేరు ప్రాజెక్టుకు వెళ్లారు. జలాశయంలో చేపలు పడుతుండగా, ప్రమాదవశాత్తు కుమారుడు నీటిలో మునిగిపోయారు. కుమారుడిని రక్షించే క్రమంలో తండ్రి కూడా నీటిలోకి వెళ్లడంతో ఇద్దరూ నీట మునిగి దుర్మరణం చెందారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో మొగలిపల్లి కొత్తూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

