కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల నియోజకవర్గంలో మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar).. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అజారుద్దిన్‌ను కోరారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు మంత్రి జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆయనను కలిశారు. అనంతరం జగిత్యాల నియోజకవర్గంలో మైనార్టీలోన్లు, కుట్టు మిషన్ యూనిట్ల సంఖ్య పెంచాలని, ఉర్దూ ఘర్ అభివృద్ధి, హజ్‌భవన్ నిర్మాణానికి రూ. కోటి చొప్పున నిధులు కేటాయించాలని, ఉర్దూ టీచర్ల నియామకం చేపట్టాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కౌన్సిలర్ బోయినపల్లి ప్రశాంత్ రావు పాల్గొన్నారు. మహమ్మద్ అజహారుద్దీన్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు.

