కలం, నల్లగొండ బ్యూరో: మర్రిగూడ (Marriguda) బైపాస్ ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. చర్లపల్లి వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పలువురు ముఖ్య నాయకులను డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. అరెస్టయిన వారిని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలను దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వెంటనే స్టేషన్‌కు చేరుకున్నారు.
ఆయనతో పాటు దేవరకొండ నియోజకవర్గ సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చి, అరెస్టులకు నిరసనగా స్టేషన్ ఎదుట బైఠాయించారు. కంచర్ల భూపాల్ రెడ్డికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఫ్లైఓవర్ ప్రారంభం ఆలస్యానికి అదే కారణం..
ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పానగల్ బైపాస్, మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్లకు నిధులు మంజూరు చేసి, నిర్మాణ పనులను పూర్తి చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాల వల్లే పూర్తయిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించడం లేదని మండిపడ్డారు. ప్రారంభం ఆలస్యం కావడం వలన ఆ మార్గంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఒకరు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే స్పందించి మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్లు దొడ్డి రమేష్, దీప్లా నాయక్, గోపగోని స్వాతి రాజశేఖర్, నాయకులు గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, పెండం ధనుంజయ్, మెండు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ నాయక్, చెనగోని నాగరాజు తదితరులు ఉన్నారు.

