Mobile Popup Ad
Mobile Popup Ad

బ్రిటిష్ ఓపెన్ స్క్వాష్: రెండో రౌండ్లోనే ముగిసిన భారత్ పోరాటం!

కలం, స్పోర్ట్స్​ : బ్రిటిష్ ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌ (British Open Squash Championship) లో భారత ఆటగాళ్ల జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత స్టార్లు అభయ్ సింగ్, వీర్ చోట్రానీలు తమ కంటే మెరుగైన ర్యాంక్ ఉన్న టాప్-10 క్రీడాకారుల చేతిలో ఓడిపోవడంతో టోర్నమెంట్‌లో భారత్ సవాలు ముగిసింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రమిత్ టాండన్ గాయంతో మధ్యలోనే వెనుదిరగగా, మహిళల విభాగంలో యువ సంచలనం అనాహత్ సింగ్ ఈజిప్ట్ క్రీడాకారిణి నార్డిన్ గరాస్ చేతిలో ఓటమి చవిచూసింది.

అయితే మొదటి రౌండ్‌లో కొలంబియా ఆటగాడు మాటియాస్‌పై అభయ్ సింగ్ (11-8, 11-5, 11-4), పాకిస్తాన్ ప్లేయర్ నూర్ జమాన్‌పై వీర్ చోట్రానీ (11-8, 12-14, 11-6, 11-7) సంచలన విజయాలు సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన ఉత్కంఠభరితమైన రెండో రౌండ్ పోరులో ప్రపంచ 24వ ర్యాంకర్ అభయ్ సింగ్.. ఈజిప్ట్ స్టార్, ప్రపంచ 8వ ర్యాంకర్ మొహమ్మద్ జకారియాను ముప్పతిప్పలు పెట్టారు. మొదటి రెండు గేమ్‌లు ఓడిపోయినా, మూడో గేమ్‌ను గెలిచి గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఉత్కంఠ రేపిన నాలుగో గేమ్‌లో జకారియా అనుభవం ముందు నిలవలేక 9-11, 4-11, 11-7, 10-12 తేడాతో అభయ్ ఓటమిపాలయ్యారు.

మరో మ్యాచ్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్ వీర్ చోట్రానీ సైతం వెల్ష్‌కు చెందిన ప్రపంచ 6వ ర్యాంకర్ జోయెల్ మేకిన్‌కు గట్టి సవాలు విసిరారు. మొదటి రెండు గేమ్‌లలో హోరాహోరీగా తలపడినప్పటికీ, చివరికి 10-12, 9-11, 3-11 తేడాతో పరాజయం పాలయ్యారు. భారత క్రీడాకారులు రెండో రౌండ్‌లోనే వెనుదిరిగినప్పటికీ, ప్రపంచ స్థాయి అత్యుత్తమ ఆటగాళ్లకు చెమటలు పట్టించి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ (British Open Squash Championship) లో తమ సత్తా చాటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>