కలం, వెబ్ డెస్క్: లండన్ (London)లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెడ్‌ఫోర్డ్ సమీపంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా బ్రిటీష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ దీనిని ‘మేజర్ ఇన్సిడెంట్’ గా ప్రకటించారు. సమాచారం అందుకున్న వెంటనే బెడ్‌ఫోర్డ్‌షైర్ ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది, అంబులెన్స్‌లు, ఎయిర్ అంబులెన్స్ సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదం కారణంగా లండన్‌లోని సెంట్రల్ లండన్ సెంట్ పాన్‌క్రాస్ స్టేషన్ నుండి నడిచే రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్బీ నుండి లండన్ సెంట్ పాన్‌క్రాస్ వెళ్తున్న ఈస్ట్ మిడ్‌లాండ్స్ రైల్వే రైలు, నాటింగ్‌హామ్ నుండి వస్తున్న మరో రైలు బెడ్‌ఫోర్డ్ సౌత్ వద్ద ఢీకొన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నేపథ్యంలో లండన్ సెంట్ పాన్‌క్రాస్ స్టేషన్ నుండి నడిచే రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు, ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రైల్వే సంస్థ సూచించింది.

