ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.. భువనగిరి కలెక్టరేట్ వద్ద ఆందోళన!

కలం, భువనగిరి: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) కలెక్టరేట్ ఎదుట రైతులు భారీ ఆందోళనకు దిగారు. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ గేటు ముందు ధాన్యం బస్తాలు వేసి, రోడ్డుపై ధాన్యాన్ని ఆరబోసి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. మార్కెట్‌కు ధాన్యం తీసుకువచ్చి దాదాపు 50 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ చేపట్టలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఐకేపీ కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నామని, ఐతే అధికారులు, పాలకులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “జై జవాన్.. జై కిసాన్”, “ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి”, “ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం” అంటూ చేసిన నినాదాలతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. నిరసనను అడ్డుకునే క్రమంలో ఇప్పటికే పలువురు రైతు నేతలను, రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్ వైపు రైతులు భారీగా చేరుకుంటూనే ఉన్నారు. తమ ధాన్యం కొనుగోలు చేసే వరకు కదిలేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>