సంగారెడ్డి జిల్లాలో నకిలీ ష్యూరిటీ పత్రాల కలకలం

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంది మండల కేంద్రంలో బెయిల్ కోసం నకిలీ ష్యూరిటీ పత్రాలు (Fake Surety Documents)  సృష్టించిన ఘటన కలకలం రేపింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ కోర్టులో ఓ కేసుకు సంబంధించి నాలుగు లక్షల విలువజేసే ష్యూరిటీ అందజేశారు. ఈ ష్యూరిటీ పత్రాలు కంది గ్రామ పంచాయతీ నుండి ఇచ్చినట్లుగా ఉంది. పత్రాలపై అనుమానం వచ్చిన ఒక న్యాయవాది కంది గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. పంచాయతీ కార్యదర్శి స్టాంప్ మిస్ కావడం, అదే స్టాంప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి నకిలీ సంతకాలు చేసినట్లు తేలింది.

ఈ ఘటనతో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. స్టాంప్ పోయిన విషయం సకాలంలో గుర్తించకపోవడం, పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయవాది విచారణ తర్వాత మాత్రమే ఈ విషయం వెలుగులోకి రావడం పాలనా వైఫల్యంగా భావిస్తున్నారు. విషయం బయటపడిన వెంటనే గ్రామ కార్యదర్శి కవిత సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, కంది గ్రామంలో ఉన్న సెంట్రల్ జైలు కారణంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఖైదీలు ఉండటంతో స్థానిక ష్యూరిటీలు అవసరం అవుతాయని, ఇదే అవకాశంగా తీసుకుని నకిలీ పత్రాల దందా సాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రవాణా శాఖలో అనధికార వాహన రిజిస్ట్రేషన్ల ఆరోపణలు రావడంతో, ఇప్పుడు ఈ నకిలీ ష్యూరిటీ పత్రాల వ్యవహారం కూడా పెద్ద నెట్‌వర్క్‌గా ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>