కలం, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలను అందించడమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం అందోల్ – జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి దామోదర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిరకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు అందించే దిశగా తమ ప్రభుత్వం ఆధునిక వైద్య సదుపాయాలను అందజేస్తోందని తెలిపారు.
వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం..
అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలందించేందుకు ట్రామా, ఎమర్జెన్సీ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి వివరించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని.. వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నామని వివరించారు. మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులను కేటాయిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నామని చెప్పారు. ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. అందోల్ లో త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. అందోల్ నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా (ఎడ్యుకేషన్ హబ్‌గా) అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రూ.200 కోట్లతో సింగుర్ లైన్ పనులను ప్రారంభించామని చెప్పారు.

