కలం, నాగర్ కర్నూల్: రైతులతో రాజకీయం చేయొద్దని, నకిలీ ఎరువులను అమ్ముతున్న కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అండగా నిలుస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ రాకతో రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. 150 రూపాయల విలువ చేసే DAP ని 1600 పైగా విక్రయించి 1400 వందలకు పైగా వచ్చిన లాభం అవినీతి సొమ్ము ఎవరి జేబులోకి పోయిందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే దేశ్ ముఖ్ లని.. వారు చెప్పేదొకటి చేసేదొకటి విమర్శలు గుప్పించారు. నకిలీ DAP దళారులపై కఠిన చర్యలు తీసుకుపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట వంట వార్పు పెట్టి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
నకిలీ డీఏపీ, ఎరువుల కృత్రిమ కొరతకు అసలు బాధ్యులు ఎవరని, సకాలంలో డీఏపీ అందించి ఉంటే నకిలీ ఎరువుల దందాకు అవకాశం వచ్చేదా? అని ప్రశ్నించారు. నెల రోజుల్లో న్యాయం చేస్తామని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఏమైందొ చెప్పాలని డిమాండ్ చేశారు. తన పక్కన ఉన్న మోసగాళ్లు తనకు కనిపిస్తాలేరా, మతి మరుపు వుందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. దొంగలను తన పక్కనే పెట్టుకుని భారీ డైలాగులు కొట్టడం తప్ప స్థానిక ఎమ్మెల్యేకు వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేదని, రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించే తీరిక కూడా లేదన్నారు.
BRS ప్రభుత్వ హయాంలో రైతు రాజ్యం నడిస్తే, నేడు కాంగ్రెస్ పాలనలో రైతుల పాలిట రాక్షస రాజ్యం నడుస్తోంది అని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ మండలం లో పెద్ద ముద్దునూర్ తదితర కొనుగోలు కేంద్రాల్లో “RR టాక్స్” పేరుతో ఒక్కో సంచికి రూ.35 నుంచి రూ.50 వరకు అక్రమంగా వసూలు చేసి రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అదేవిధంగా మొక్క జొన్న లు అమ్ముకున్నా రైతులకు దూరాన్ని అంచనా వేసి వారికి ట్రాన్స్పోర్ట్ డబ్బులు చెల్లించాలి. .కానీ డిండి దగ్గర గల గోదాం లకి , నాగర్ కర్నూల్ లో గల గోదాంలకి పంపిన రైతులకు ఒకే రకమైన ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఇస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం అన్నారు.
ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు మా పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. అదేవిధంగా బిజినపల్లి మండలంలో పలు గ్రామాల్లో కొంత మంది ప్రైవేట్ ముఠాగా ఏర్పడి రైతుల మొక్క జొన్నలని కొని వారికి డబ్బులు ఎగ గొట్టి పారిపోతే వారిపైన కనీసం చర్యలు శూన్యం అన్నారు. బిజినపల్లిలో “నా పక్కన ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటా” అని ప్రకటించిన ఎమ్మెల్యే.. నీ అనుచరులు ట్రాన్స్పోర్ట్ పేరిట, గన్ని బ్యాగ్ ల పేరిట దందాలు చేసి రైతులని మోసం చేస్తే వారిపైన చర్యలు తీసుకునే సాహసంచేయకపోవడం చాలా దారుణం అన్నారు. ఎమ్మెల్యే మాటలు కాదు చేతల్లో నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు.

