కలం, వెబ్ డెస్క్: ఎవరైనా యూట్యూబ్‌లో వీడియోలు చూసి వంటలు నేర్చుకుంటారు.. లేదా ఏదైనా కోర్సులు నేర్చుకుంటారు.. కానీ, ఓ భార్యాభర్తలు యూట్యూబ్ చూసి ఏకంగా నకిలీ నోట్లనే (Fake Currency) తయారు చేశారు. చివరికి తమ బాగోతం బట్టబయలై పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. ఈ ఘటన నల్గొండ (Nalgonda) జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన విజయవాడ రాజీవ్, పావని దంపతులు స్థానికంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తమకు ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ నోట్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
దీని కోసం యూట్యూబ్ వీడియోలను చూసి, నకిలీ కరెన్సీ తయారీకి అవసరమైన ప్రింటర్, ప్రత్యేక పేపర్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశారు. తమ ఇంట్లోనే రూ.500 నకిలీ నోట్లను ముద్రిస్తూ, వాటిని రద్దీగా ఉండే షాపులు, సంతలను లక్ష్యంగా చేసుకుని చెలామణి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో చండూరులోని తాస్కానీగూడెంలో ఒక మిల్క్ సెంటర్‌లో రాజీవ్ పాల ప్యాకెట్ కొనుగోలు చేసి, షాపు యజమాని ఆవుల కిరణ్‌కు రూ.500 నకిలీ నోటు ఇచ్చాడు. ఆ నోటును గమనించిన యజమానికి అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి అది నకిలీ నోటుగా నిర్ధారించారు. అనంతరం రాజీవ్‌పై నిఘా పెంచిన పోలీసులు పక్కా సమాచారంతో కొత్తగూడెంలోని రాజీవ్ఇంటిపై దాడి చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

