మెదక్‌లో కరువు పరిస్థితులు.. క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ కమిటీ పర్యటన!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నీటి వనరులు అడుగంటడంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో వివిధ ప్రజాసంఘాలు, రైతు సంఘాలతో జర్నలిస్టులు కూడిన నిజనిర్ధారణ కమిటీ (Fact Finding Committee) పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించింది.

పర్యటనలో భాగంగా టేక్మల్ మండలం ధనూర్, పాల్వంచ, మల్కాపూర్ గ్రామాలలో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా రైతులతో మమేకమవుతూ ఎండిపోయిన వరి, పత్తి పంటలను పరిశీలించిన కమిటీ సభ్యులు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు ధనుర్ గ్రామంలో 400 ఎకరాల్లో సాగు చేసిన వరి, పత్తి పంటలు నీరు లేక ఎండిపోయాయని రైతులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.

వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తే చివరకు అప్పులపాలై ఆగమవుతున్నామని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పంటలకు నీరు అందించడం దేవుడెరుగు.. కనీసం పశువులు, బర్రెలు తాగేందుకు బోరు నుంచి నీళ్లు వస్తే చాలనే దుస్థితి నెలకొందని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని, పంట నష్టాలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ నిజనిర్ధారణ పర్యటనలో సీపీఎం నాయకులు మల్లేశం, మెదక్ సిటిజన్ ఫోరం, బి. కొండల్ రెడ్డి, రైతు స్వరాజ్ వేదిక, భాగయ్య, మానవ హక్కుల వేదిక, రాష్ట్ర నాయకులు హైమద్, టీఆర్ఎస్ నాయకులు బట్టి అజయ్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సురేందర్ రెడ్డి, బొందుగుల నాగరాజు, టేక్మాల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు భాగయ్య, టీఆర్ఎస్ నాయకులు కరెంట్ ప్రేమ్ కుమార్ చౌదరి, భాను పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>