కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నాటు సారా అక్రమ విక్రయాలు, రవాణాపై అబ్కారీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. భద్రాచలం (Bhadrachalam) పట్టణంలో నాటు సారా విక్రయాలే లక్ష్యంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్ రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సీహెచ్. శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు చేపట్టింది. అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి 20 లీటర్ల నాటు సారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం విచారణ కోసం భద్రాచలం అబ్కారీ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు వివరించారు.

