కలం, వెబ్‌డెస్క్: నేటి కాలంలో విద్య, వ్యాపారం, ఐటీ రంగాల నుండి మొదలుకొని సామాన్య గృహిణుల వరకు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ ఒక అనివార్యమైన భాగమైపోయింది. ఆఫీసులో తొమ్మిది నుంచి పది గంటల పాటు కంప్యూటర్లపై వర్క్ చేస్తున్నారు. మళ్లీ ఇంటి తిరిగి వచ్చిన తర్వాత కూడా మిగిలిన సమయాన్ని తమ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై గడుపుతున్నారు. కానీ టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడటం వల్ల, జీవితంలో తర్వాత దశలో వచ్చే సమస్యలు చిన్న వయసులోనే తలెత్తుతున్నాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి ఒక సమస్యే టెక్ నెక్ (Tech Neck).
టెక్ నెక్ సమస్య అంటే ఏంటి?
రోజూ గంటల తరబడి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించడం వల్ల యువతలో మెడ, వెన్నుపూస సమస్యలు రావడానికి ప్రధాన కారణం అవుతోంది. వైద్యులు ఈ సమస్యను “టెక్ నెక్” (Tech Neck) అని పిలుస్తున్నారు. స్క్రీన్‌ల వైపు చూస్తూ చాలా సేపు తల ముందుకు వంచి ఉంచడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందట. సాధారణంగా మనిషి తల బరువు సుమారు 4 నుంచి 5 కిలోలు ఉంటుంది. కానీ, మనం తలను ముందుకు వంచినప్పుడు, ఆ వంపు కారణంగా వెన్నుపూసపై పడే ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఈ అదనపు భారం వల్ల మెడ నొప్పి, బిగుతుగా మారడం (Stiffness), దీర్ఘకాలిక శారీరక ఆకృతి (Posture) లోపాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు డాక్టర్ ఎం ఎస్ సోమన్న తెలిపారు.
మెడ నొప్పికి దారితీసే అలవాట్లు ఇవే!
అయితే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం బ్రేక్ తీసుకోకుండా గంటల తరబడి ల్యాప్ టాప్‌లు, ఫోన్లు చూడటం. చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు బ్రేక్స్ తీసుకోకుండా గంటల తరబడి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు వాడుతుంటారు. అయితే కూర్చునే పద్ధతి సరిగ్గా లేకపోవడం, మంచాలపై పడుకుని డివైజ్‌లు ఉపయోగించడం, నిరంతరం ఫోన్ వైపు కిందికి చూస్తూ ఉండటం వల్ల మెడ కండరాలు బలహీనపడి, వెన్నుపూసపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.
నిర్లక్ష్యం చేస్తే వచ్చే నష్టాలు
కాలక్రమేణా ఈ అలవాటు వల్ల తలనొప్పి, భుజాల నొప్పి, కండరాలు పట్టేయడం, చేతుల్లో తిమ్మిర్లు (Tingling) వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. సమస్య తీవ్రమైతే స్లిప్డ్ డిస్క్ (Slipped Disc), చిన్న వయసులోనే వెన్నుపూస అరిగిపోయే ప్రమాదం ఉంది. ఎముకలు, కండరాలు ఎదుగుతున్న దశలో ఉండే పిల్లలు, టీనేజర్లలో ఈ రిస్క్ మరింత ఎక్కువ. శారీరక శ్రమ లేకపోవడం వల్ల వెన్నుముకకు సపోర్ట్ ఇచ్చే కోర్ కండరాలు (Core muscles) బలహీనపడతాయి.
ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలి?
మన జీవనశైలిలో చేసుకునే చిన్నపాటి మార్పులతో ‘టెక్ నెక్’ సమస్యను నివారించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
- స్క్రీన్‌ను ఎప్పుడూ మన కంటి చూపు స్థాయికి (Eye level) సమానంగా ఉంచుకోవాలి.
- ప్రతి 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం (Break) తీసుకుని కండరాలకు విశ్రాంతినివ్వాలట.
- స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వెనుక భాగంలో సరైన సపోర్ట్ ఉన్న కుర్చీల్లో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.
- అనవసరమైన స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవడం.

